గణేష్ నిమజ్జన ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్ జెండర్ల భాగస్వామ్యం - జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల, సెప్టెంబర్ 21 (సమాజహితం ప్రతినిధి) : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాన్స్ జెండర్లను భాగస్వామ్యం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించే అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, గణేష్ నిమజ్జనోత్సవ బందోబస్తులో ట్రాఫిక్ నియంత్రణ విధులు నిర్వహించనున్న 17 మంది ట్రాన్స్ జెండర్లకు టీషర్ట్ లను అందజేశారు. అనంతరం వారికి విధుల నిర్వహణకు సంబంధించిన సూచనలు, మార్గదర్శకాలను అందించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు, గణేష్ విగ్రహాలు తరలివచ్చే ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ సిబ్బందితో కలిసి ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ నియంత్రణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జన బందోబస్తులో ట్రాన్స్ జెండర్లను భాగస్వామ్యం చేయడం ద్వారా సమాజంలోని ప్రతి వర్గానికి గౌరవం, మర్యాద, సమానత్వం కల్పించాలనే సానుకూల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం లభించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి బాధ్యతాయుతమైన విధుల్లో వారు పోలీస్ సిబ్బందితో కలిసి పనిచేయడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృతమైన బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టిందని తెలిపారు. నిమజ్జన మార్గాల్లో వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం, ట్రాఫిక్ ను సజావుగా కొనసాగించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనోత్సవానికి వచ్చే భక్తులు, ప్రజలు పోలీస్ శాఖ సూచనలను పాటిస్తూ ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, టౌన్ ఇన్ స్పెక్టర్ కరుణాకర్, ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.