వేదఘోషల నడుమ గణనాథుడి నిమజ్జనం.. మంథనిలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర!
పెద్దపల్లి, సెప్టెంబర్ 23 (సమాజహితం): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గణనాథుని నిమజ్జనం భక్తిశ్రద్ధల మధ్య సాంప్రదాయబద్ధంగా జరిగింది. డీజేలు, నృత్యాలకు భిన్నంగా వేద మంత్రోచ్ఛారణలు, వేద ఘోషల నడుమ వినాయకుడి శోభాయాత్ర నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంథని పట్టణంలో, గ్రామ గ్రామాన వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు మండపాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, భజనలు, సంకీర్తనలు, సామూహిక అన్నదాన కార్యక్రమాలతో గణనాథునికి భక్తులు ఘనంగా సేవలందించారు.మంగళవారం ఏకాదశి సందర్భంగా మహిళా భక్తులు ఏకరూప దుస్తులు ధరించి, ఇళ్ల నుంచి ప్రత్యేకంగా మంగళహారతులు తీసుకువచ్చారు. అనంతరం లంబోదరునికి సామూహికంగా నీరాజనాలు సమర్పించారు.పట్టణంలోని శ్రీ మహాగణాధిపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సాంప్రదాయబద్ధంగా ఊరేగించి నిమజ్జనం చేశారు. వేద పాఠశాల విద్యార్థులతో కలిసి భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. వేద విద్యార్థుల వేదఘోషతో మంథని పట్టణ వీధులు మార్మోగాయి. సాధారణంగా వినాయక నిమజ్జనం అంటే డీజేలు, నృత్యాలు, సందడితో కూడిన ఊరేగింపులు కనిపిస్తాయి. అయితే మంథనిలో అందుకు భిన్నంగా వేద పాఠశాల విద్యార్థులు వేద పారాయణం చేస్తూ గణనాథుడిని నిమజ్జనానికి తరలించడం విశేషంగా నిలిచింది.ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ వినాయక శోభాయాత్ర భక్తులను ఆకట్టుకుంది. వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల మధ్య గణనాథుడి నిమజ్జనం ప్రశాంతంగా, సాంప్రదాయబద్ధంగా జరిగింది.