కుటుంబ సమేతంగా ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్న హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్!
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (సమాజహితం): హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ గారు బుధవారం తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశుడిని దర్శించుకున్నారు. దర్శనార్థం విచ్చేసిన వారికి గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీపీ గారు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ మహాగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహామంగళహారతి సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నగర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, హైదరాబాద్ మహానగరం శాంతిభద్రతలతో నిరంతరం ప్రశాంతంగా విలసిల్లాలని విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశంలోనే ఎంతో విశిష్టమైన ఖైరతాబాద్ బడా గణేశుడిని ఇప్పటివరకు 25 లక్షల మంది దర్శించుకున్నారని వెల్లడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి భక్తుల దర్శనానికి అనుమతి లేదని చెప్పారు. శుక్రవారం శోభాయాత్ర నాడు దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ శోభాయాత్ర జరిగేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు.