🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 October 2026, 6:23 pm Posted by : SAMAJA HITHAM

కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల

News Image
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యాల

- ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్

- ఉత్సాహంగా, ఉల్లాసంగా అలరించిన AURA 2K26 – A GenZ Gala

జగిత్యాల జిల్లా (సమాజహితం): ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ కళాశాలలను ప్రోత్సహిస్తున్నారని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి), జగిత్యాల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన AURA 2K26 – A GenZ Gala ఫ్రెషర్స్ పార్టీ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విద్యా ప్రమాణాలను పెంపొందించుకుంటూ ముందుకు సాగుతోందని ప్రశంసించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వం పలు నూతన కోర్సులను ప్రవేశపెడుతోందని తెలిపారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన BFSI (Banking, Financial Services and Insurance), Healthcare రంగాలకు సంబంధించిన AEDP కోర్సులు విద్యార్థినుల్లో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్లెండెడ్ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా మారుతోందని, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు (AI) విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, AI ఎన్నటికీ ఉపాధ్యాయుడి స్థానాన్ని భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె. రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అతిథులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. ప్రముఖ సామాజిక సేవకులు, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ జగిత్యాల ఇన్‌చార్జి శ్రీ మంచాల కృష్ణ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులు విద్యతో పాటు సేవాభావం, క్రమశిక్షణ, మానవీయ విలువలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో మానవీయ విలువలు, సృజనాత్మకత, నైతికత, ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
కళాశాల విద్యార్థులకు సుమారు 50 వేల రూపాయల పుస్తకాలను తనవంతు సహాయంగా గ్రంథాలయనికి అందిస్తామన్నారు.

కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థినులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, వివిధ రాష్ట్రాల సాంస్కృతిక నృత్యాలు, సినీ గీతాలకు అనుగుణంగా చేసిన నృత్య ప్రదర్శనలు, గీతాలాపనలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థినులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగాయి. విద్యార్థినులలోని కళాత్మక ప్రతిభ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను ఈ వేడుకలు చాటిచెప్పాయి.

ఈ కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్ బాడీ సభ్యులు రాజు, సీనియర్ జర్నలిస్టు టీవీ సూర్యం, వార్డు సభ్యులు తిరుమలయ్య, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. చంద్రయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి. ప్రమోద్ కుమార్, అధ్యాపకులు ప్రొఫెసర్ వి. వరప్రసాద్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. వాసవి, అకాడమిక్ కోఆర్డినేటర్ జి. రాంచంద్రమ్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ కుమారి జి. నీరజ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ డి. సుజాత, చరిత్ర విభాగాధిపతి ఎస్. మల్లికార్జున్, స్టాఫ్ సెక్రటరీ డాక్టర్ ఎన్. సంగీత రాణి, డాక్టర్ జి. శ్రీలత, డా. జమున తదితర అధ్యాపకులు 1000కి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు.
🏠 Home