🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 03 October 2026, 10:25 pm Posted by : SAMAJA HITHAM

శ్రీసిటీలో పేలిన బాయిలర్

News Image
తిరుపతి జిల్లా, అక్టోబర్ 03 ( సమాజహితం న్యూస్ ) : తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని పారిశ్రామిక కేంద్రం శ్రీసిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ‘టిల్ హెల్త్‌కేర్’ (TIL Healthcare) పరిశ్రమలో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి బాయిలర్ యూనిట్ ఉన్న భవనం పూర్తిగా నేలమట్టమైంది. పేలుడు ధాటికి కూలిన భవనం ఉదయం 8 గంటల సమయంలో కార్మికులు విధుల్లో ఉండగా బాయిలర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఆ ధాటికి పైకప్పు ఇనుప రాడ్లు, కాంక్రీట్ శకలాలు ఎగిరిపడ్డాయి. బాయిలర్ వద్ద పనిచేస్తున్న ఇద్దరు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, శిథిలాల కింద చిక్కుకున్న మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలపాలైన మరో కార్మికుడిని మెరుగైన చికిత్స నిమిత్తం చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలం నుంచి నమూనాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. బాయిలర్‌లో ఉష్ణోగ్రత అధికమై పేలుడు జరిగిందా లేక యాంత్రిక, మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్‌పై వేటు.. రూ.50 లక్షల పరిహారం ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. భద్రతా తనిఖీల్లో నిర్లక్ష్యం వహించినందుకు బాధ్యుడిగా చేస్తూ బాయిలర్స్ ఇన్‌స్పెక్టర్ రాంబాబును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తక్షణ సహాయంగా అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబాలకు అందజేసింది. ఇప్పటివరకు శ్రీసిటీలో ఇలాంటి ప్రమాదం ఎన్నడూ జరగలేదని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
🏠 Home