🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 11:30 pm Posted by : SAMAJA HITHAM

జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలు పటిష్టంగా అమలు చేయాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

News Image
జగిత్యాల, అక్టోబర్ 05 (సమాజహితం న్యూస్): జిల్లాలో ఆహార భద్రత ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో చిన్నారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వంటశాలల పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ, వంట ప్రక్రియ, తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, స్ట్రీట్ ఫుడ్, మెస్‌లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించేలా నిరంతరం తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో ఆహార పదార్థాల నాణ్యత, గడువు తేదీలు, నిల్వ విధానం, ప్యాకేజింగ్‌ను పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని విక్రయాలను నిరోధించాలని సూచించారు. ప్రజలకు అందించే తాగునీటి వనరులు, సరఫరా వ్యవస్థలు, నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సురక్షితమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమగ్ర కార్యాచరణ రూపొందించి, ఆహార భద్రత నిబంధనలపై వ్యాపార సంస్థల నిర్వాహకులకు, ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పనిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష, డీపీవో మదన్ మోహన్, డీడబ్ల్యూవో భాస్కర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home