ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, అక్టోబర్ 05 (సమాజహితం న్యూస్): ప్రజావాణి ద్వారా ప్రజల నుండి అందుతున్న ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించి, మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారని, ప్రతి ఫిర్యాదును అధికారులు బాధ్యతాయుతంగా తీసుకొని సమగ్ర విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని తెలిపారు. నిర్లక్ష్యం లేకుండా మెరుగైన సేవలు అందించాలన్నారు. కాగా ప్రజావాణికి మొత్తం 67 ఫిర్యాదులు, వినతులు అందాయని, వాటిని సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, పరిష్కరించి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రభుత్వ సేవలు సకాలంలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజా గౌడ్, డీఆర్‌వో కె. వై ప్రసాద్, ఆర్‌డీవో లు జీవాకర్ రెడ్డి, నరసింహారావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.