🏠 samajahitham.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 October 2026, 10:41 pm Posted by : SAMAJA HITHAM

సరైన జీవనశైలితో వెన్నునొప్పికి చెక్‌

News Image
సరైన జీవనశైలితో వెన్నునొప్పికి చెక్‌

సెల్‌ఫోన్‌, గ్యాడ్జెట్ల మితిమీరిన వాడకంతో మెడ, నడుము నొప్పులు
– మెడికవర్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి

జగిత్యాల జిల్లా, అక్టోబర్ 16 ( సమాజహితం న్యూస్ ) : మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ తగ్గడం, కూర్చునే భంగిమలో లోపాలు, సెల్‌ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల మితిమీరిన వినియోగం కారణంగా మెడ, నడుము నొప్పుల సమస్యలు పెరుగుతున్నాయని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి పేర్కొన్నారు. వరల్డ్ స్పైన్ డే సందర్భంగా శుక్రవారం జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూరో సర్జన్ డాక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సరైన జీవనశైలి, క్రమం తప్పని వ్యాయామం, తగిన జాగ్రత్తలతో వెన్నుముక సమస్యలను చాలావరకు నివారించవచ్చని అన్నారు. వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది మెడ, నడుము నొప్పులతో బాధపడుతున్నారని, కొన్ని సందర్భాల్లో మెడ భాగంలోని వెన్నుముక నరాలపై ఒత్తిడి పడటంతో తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వివరించారు. రోజూ వ్యాయామం చేయడం, కూర్చునేటప్పుడు, నిలబడేటప్పుడు సరైన పద్దతిని పాటించడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్యమధ్యలో కదలడం, ఫోన్‌, ల్యాప్‌టాప్‌ వినియోగాన్ని పరిమితం చేయడం ద్వారా వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. వెన్నుముక శస్త్రచికిత్సలంటే భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికతతో మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ విధానంలో చిన్న గాటు ద్వారా శస్త్రచికిత్సలు నిర్వహించే అవకాశం ఉందన్నారు. రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి శస్త్రచికిత్స జరిగిన రోజే లేదా మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఇటువంటి ఆధునిక చికిత్సా సదుపాయాలు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో డాక్టర్ వినయ్ కుమార్, క్రిటికల్ కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి, మార్కెటింగ్ హెడ్ కోట కరుణాకర్, దాసరి చంద్రశేఖర్, మనోజ్ కుమార్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home