Loading Time...
న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ
News App యాప్ ద్వారా సులభంగా వార్తలు చదవండి

దసరాకు ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

Author SAMAJA HITHAM | 09 Oct 2026, 10:40 PM | జగిత్యాల
దసరాకు ఊళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోండి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల, అక్టోబర్ 09 ( సమాజహితం న్యూస్ ) : దసరా పండుగ సందర్భంగా చాలామంది తమ స్వగ్రామాలకు, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తుంటారని, ఇదే అదనుగా భావించి దొంగలు ఇళ్లలో చోరీలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ సూచించారు. పండుగకు ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్ల భద్రత విషయంలో ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. జిల్లా పరిధిలో చోరీల నియంత్రణకు పోలీసు శాఖ తరఫున అన్ని అవసరమైన చర్యలు చేపడుతున్నామని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీని ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని కోరారు.

దొంగతనాల నివారణకు పోలీసు శాఖ సూచనలు:

ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం బయటకు కనిపించకుండా పరదా కప్పి ఉంచాలని, మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసి పక్క డోర్లకు తాళం వేయడం మంచిదని తెలిపారు. ఊరు వెళ్లేముందు ఇంట్లో బంగారు, వెండి, డబ్బు వంటి విలువైన వస్తువులను బీరువాలో పెట్టకూడదని, బ్యాంక్ లాకర్లలో దాచుకోవడం మంచిదని సూచించారు. విలువైన వస్తువులు, వ్యక్తిగత ఆర్థిక విషయాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. బీరువా తాళాలు ఇంట్లో కప్ బోర్డులు లేదా ఇతర ప్రదేశాలలో ఉంచకూడదన్నారు. ఊరు వెళితే ఇంటి పక్కనవారికి, సంబంధిత పోలీసులకు సమాచారం అందించడం ద్వారా, రాత్రి సమయాల్లో గస్తీ తిరగడానికి వచ్చినప్పుడు ఇంటిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని తెలిపారు. రాత్రి సమయంలో ఏదైనా ఒక రూమ్ లో లైట్ వెలుగుతూనే ఉండేలా ఆన్ చేసి ఉంచాలని సూచించారు. అనుమానిత లేదా కొత్త వ్యక్తులు ఇంటి చుట్టూ తిరగడం కనిపిస్తే వెంటనే 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. మీ మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చేలా ఇంటికి సీసీ కెమెరా అమర్చుకోవాలని, ఇంటి బయట నాలుగు దిక్కులు కవర్ అయ్యేలా కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. చుట్టుపక్కల వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం, ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని తెలిపారు. ఇంట్లో వుండే మహిళలు, వృద్ధుల వద్దకు.. ఎవరైనా అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే వారిని నమ్మవద్దని చెప్పాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి