ప్రధానమంత్రి నివాసం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేయడంపట్ల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్లో చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందుకు శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు, పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేయడం చూస్తుంటే ‘గురవింద గింజ’ సామెత గుర్తుకొస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ దివాళాకోరుతనానికి అద్దం పడుతోంది.
నీట్ ప్రశ్నపత్రంపై లోక్ సభలో చర్చకు సిద్ధమని ప్రభుత్వం ముందుకు వచ్చినా కూడా చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ బాధ్యులను ఇప్పటికే న్యాయస్థానం ముందు నిలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో కచ్చితంగా దోషులకు శిక్ష పడే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మనవి చేస్తున్నాను.
